జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (GPA)

జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (GPA)

1) ఒక వ్యక్తి తనకున్న ఆస్తిపై గల బాధ్యతను మరొకరికి ఎవ్వరికయినా బదిలీ చేయటాన్ని "పవర్ ఆఫ్ అటార్నీ" అంటారు. స్థిర, చరాస్తుల్లో దేనికైనా పవర్ ఆఫ్ అటార్నీ (POA) రాయొచ్చు. POA వలన ఆస్తిపై ఉన్న హక్కులు బదలాయించబడవు. కేవలం బాధ్యతలు మాత్రమే బదలాయించబడతాయి. భాధ్యతను స్వీకరించిన  వ్యక్తిని ఏజెంట్ అని, భాధ్యతను ఇచ్చిన వ్యక్తిని ప్రిన్సిపల్ అని అంటారు.

2) పవర్ ఆఫ్ అటార్నీ ని రెండు రకాలుగా పరిగణించొచ్చు.

మొదటిది స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ (SPOA),

రెండవది జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (GPA).

3) స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ అంటే ఒక వ్యక్తి తనకు గల భాధ్యతను ఒక వ్యవహారం నిర్వహించుటకు గాను మరొకరికి బదిలీ చేయటాన్ని స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ అంటారు. అప్పగించబడిన పని పూర్తి అయిన తర్వాత స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ రద్దవుతుంది.

ఉదాహరణకు ఒక వ్యక్తి తాను కోర్టుకు రాలేని పక్షంలో తన తరపున కోర్టుకు హాజరయ్యేందుకు గాను భాధ్యతను మరొకరికి బదిలీ చేయటాన్ని స్పెషల్ పవర్ ఆఫ్ అటార్ని అంటారు.

4) జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అంటే ఒక వ్యక్తి తనకున్న ఆస్తిపై గల హక్కుని పూర్తిగా లేదా పాక్షికంగా లేదా తాత్కాలికంగా ఇతరులకు బదిలీ చేయటాన్ని జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అంటారు. GPA ఇచ్చిన వ్యక్తి తాను ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసిన GPAని రద్దు చేసుకోవచ్చు. GPAని రద్దు చేసుకోవటానికి ఏజెంట్ యొక్క అనుమతి అవసరం లేదు. కానీ GPAని రద్దు చేసుకునేటప్పుడు ఏజెంట్ కి నోటీసు ద్వారా తెలపాల్సి ఉంటుంది. రిజిస్టర్ ఆఫీసులో GPAని రద్దు చేసుకోవచ్చు.

                ఉదాహరణకు ఒక స్థలాన్ని డెవలప్ చేయడం కోసం ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ ని నియమించుకొని వారికి GPA         ఇవ్వొచ్చు. ఇటువంటివి సాధారణంగా అపార్ట్మెంట్ డెవలప్ చేసే సమయం లో చూడొచ్చు.

5) ) జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ లో బాధ్యతని నిర్వర్తించే వ్యక్తి(ఏజెంట్)కి ప్రతిఫలం అంటూ ఏమీ ఉండదు. ఒకవేళ ) జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ లో ప్రతిఫలం గురించి రాసినట్లయితే ఆ డాక్యుమెంట్ ) జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ గా పరిగనించబడదు.

6) జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ మరియు స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ ఈ రెంటిలో ప్రిన్సిపల్, ఏజెంట్ ఇద్దరూ మేజర్లు అయి ఉండి ఇద్దరూ మానసికంగా స్వస్థతగా ఉంటేనే ఆ GPA చెల్లుబాటవుతుంది.

7) GPAలో ఏజెంట్ తాను నిర్వర్తిoచవలసిన భాధ్యతను ప్రిన్సిపాల్ ఆదేశానుసారం పూర్తి చేయవలసి ఉంటుంది. ఏజెంట్ తన ఇష్టానుసారంగా ప్రవర్తించటానికి వీలులేదు. అప్పగించబడిన ఆస్తికి సంరక్షకుడిగా మాత్రమే ఉండగలదు కానీ తన  ఇష్టానుసారం ఎవరికీ అమ్మడం కుదరదు.

8) మనం ఎక్కువగా వినే  సేల్ అగ్రిమెంట్ కం జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ వాస్తవానికి చట్టంలో లేదు. సేల్ కం జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా రిజిస్ట్రేషన్ సమయంలో స్టాంప్ డ్యూటీ, ఇతర రుసుములు తప్పించుకోవడానికి (సేల్ అగ్రిమెంట్ కం GPA రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు డాక్యుమెంట్ లో పేర్కొన్న ఆస్తికి స్టాంప్ డ్యూటీ ఎంత చెల్లించాలో అంతా చెల్లించకుండా కేవలం GPA చేసినందుకు అయిన స్టాంప్ డ్యూటీ మాత్రమే చెల్లిస్తారు) ఈ సేల్ అగ్రిమెంట్ కం GPA అనే పద్దతిని తెరమీదకి తెచ్చారు. ఈ విషయంలో సుప్రీం కోర్ట్ సూరజ్ లాంప్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ vs స్టేట్ ఆఫ్ హర్యానా అండ్ అదర్స్ కేసులో 2011వ సంవత్సరం తర్వాత సేల్ అగ్రిమెంట్ కం GPA ద్వారా జరిగిన రిజిస్ట్రేషన్లు చెల్లవని స్పష్టమైన తీర్పుని వెలువరించింది. 

9) జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ని రిజిస్ట్రేషన్ చేయించడం తప్పనిసరి.

10) ఒక వేళ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ని రిజిస్ట్రేషన్ చేయించలేని పక్షంలో GPAని కనీసం నోటరీ చేయించాలి. రిజిస్ట్రేషన్ సమయంలో ప్రిన్సిపల్, ఏజెంట్ తో పాటు ఇద్దరు సాక్షులు తప్పనిసరిగా ఉండాలి.  

11) రిజిస్ట్రేషన్ సమయంలో డాక్యుమెంట్ పైన సేల్ అగ్రిమెంట్ కం GPA అని రాస్తే ఆ డాక్యుమెంట్ చెల్లుబాటవ్వదు. డాక్యుమెంట్ పైన GPA అని మాత్రమే రాయాలి.

12) ఒక వేళ ఏజెంట్ ఏదయినా అతిక్రమణలు లేక ఆక్రమణలకు పాల్పడినట్లయితే, ఏజెంట్ చేసిన పనులకు గాను ప్రిన్సిపల్ కూడా బాధ్యుడవుతాడు.

13) జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ని ఏ పరిస్థితుల్లో చేసుకోవచ్చు

A) ప్రిన్సిపల్ కి ఇతర వ్యాపార లావాదేవీలు ఎక్కువగా వున్నప్పుడు.

B) రియల్ ఎస్టేట్ వ్యాపారం మరియు ఆస్తికి సంబందించిన వ్యవహారాలు ప్రిన్సిపల్ చూసుకోలేనప్పుడు.

C) బ్యాంక్ ఖాతాలను నిర్వర్తించడానికి, చెక్కులను జారీ చేయటానికి, టాక్స్ లను చెల్లించుటకు వీలుగా ప్రిన్సిపల్ ఒక ఏజెంట్ ని GPA ద్వారా పెట్టుకోవచ్చు.

D) ప్రిన్సిపల్ కి శారీరకంగా అంగవైకల్యం ఉంది తన పనూలు తాను స్వయంగా చూసుకోలేనప్పుడు.

E) సుదూర ప్రాంతాల్లో నివాసం ఉండి సమయానికి రాలేని సంధర్భం లో ఏజెంట్ ని GPA ద్వారా పెట్టుకోవచ్చు.

14) జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఏ సందర్భాల్లో రద్దు అవుతుంది

A) ప్రిన్సిపల్ చనిపోయిన సంధర్భం లో

B ప్రిన్సిపల్ మానసికంగా అస్వస్థుడయిన సంధర్భం లో

C) ఏజెంట్ మరియు ప్రిన్సిపల్ ఇద్దరూ GPA ని రద్దు చేసుకోవటానికి అంగీకరించిన సంధర్భం లో

D) ప్రిన్సిపల్ GPAని రద్దు చేసుకోవటానికి సిద్ధపడి ఏజెంట్ కి నోటీసు ఇచ్చిన తర్వాత దానిని రద్దు చేసుకోవచ్చు.

E) కోర్ట్ ఆదేశానుసారం GPAని రద్దు చేయవలసిన సంధర్భం లో.

15) కోర్టుకి సంబందించిన వ్యవహారాలు నిర్వర్తించటానికి గాను మరొక వ్యక్తికి GPA ద్వారా ఆ భాధ్యతను అప్పగించొచ్చు. ఇలాంటి సందర్భాల్లో పవర్ ఆఫ్ అటార్నీ చట్టం, 1882లో పేర్కొన్న విధంగా ఫారం-4 పూర్తి చేసి కోర్ట్ వారికి సమర్పించాల్సి ఉంటుంది.